- హనుమకొండలో 472 పోలియో చుక్కల కేంద్రాలు
- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే రాజేందర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటిలోని పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ప్రతి పౌరుడి బాధ్యతగా తీసుకోవాలని, భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రాకుండా పాటించాలన్నారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలో సుమారు 85,000 మంది ఐదు సంవత్సరాల వయసున్న పిల్లలు ఉన్నారు.
వారందరికీ పోలియో చుక్కలు వేయించడానికి 472 కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు. ఈ మూడు రోజుల కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి పిల్లలకు టీకాలు ఇవ్వబడతాయని తెలిపారు. వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తల్లిదండ్రులను వారి పిల్లలకు తప్పక పోలియో చుక్కలు వేయించమని అభ్యర్థించారు. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపకపోతే, పోలియో వ్యాధి జీవితాంతం సమస్యగా మారుతుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకుడు జే.వి. శ్రీనివాసరావు, డాక్టర్ ప్రసాద్, అశోక్, జిల్లా వైద్య అధికారులు, రెడ్ క్రాస్ సభ్యులు, మాస్ మీడియా ప్రతినిధులు, స్థానిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.


