రోడ్డు భద్రతపై పోలీసుల వినూత్న ప్రచారం
“అరైవ్ అలైవ్” నినాదంతో అవగాహన కార్యక్రమం
హెల్మెట్ లేని వారికి ఉచిత పంపిణీ
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో పోలీసులు రోడ్డు భద్రతపై వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఏఎస్పీ పర్యవేక్షణలో మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై మహేష్ తదితర పోలీసు సిబ్బంది వాహనదారులను ఆపి రోడ్డు భద్రతా నియమాలను వివరించారు. హెల్మెట్ ధరించి నిబంధనలు పాటిస్తున్న వాహనదారులను ప్రత్యేకంగా అభినందించి శాలువాలతో సన్మానం చేశారు. అదేవిధంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న సుమారు 20 మంది వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. “మీ ప్రాణం మీ కుటుంబానికి అమూల్యం. ట్రాఫిక్ నియమాలు పాటించి క్షేమంగా ఇంటికి చేరండి” అంటూ వాహనదారులకు పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, వాహనదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


