మాజీ ఓఎస్డీ సుమంత్ ఇంట్లో తలదాచుకున్నట్లు పోలీసుల అనుమానాలు
సెర్చ్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై మంత్రి తనయ సుస్మిత ఆగ్రహం
కాంగ్రెస్‌లో ఉంటున్నామా.. మరేదైనా పార్టీలో ఉన్నామంటూ ఘాటు వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన వీడియో..!
డెక్కన్ ప్రతినిధులకు పాయింట్ బ్లాంక్‌లో సుమంత్ గన్?
ఉత్తమ్ స్వయంగా సీఎంకు ఫిర్యాదు.. సుమంత్‌పై సీఎం రేవంత్ సీరియస్..!
కాకతీయ, వరంగల్ బ్యూరో : మంత్రి కొండా సురేఖ ఇంటి వద్దకు టాస్క్‌ఫోర్స్ వెళ్లడంపై ఇప్పుడు దుమారం రేపుతోంది. అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న ఎన్. సుమంత్‌ను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఆయనపై పలు తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం పీసీబీ కార్యదర్శి రవి గగులోతు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పీసీబీలో ఓఎస్‌డ్డీ నియమితులైన సుమంత్.. డిప్యుటేషన్‌పై మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి నుంచి వచ్చిన నోట్ ఆధారంగా 2024 ఫిబ్రవరిలో సుమంత్‌ను పీసీబీలో నియమించి.. వెంటనే మంత్రి పేషీకి పంపించారు. అప్పటి నుంచి ఆయన మంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సుమంత్‌పై సీఎం రేవంత్ సీరియస్..!
నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను సుమంత్ డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమంత్ పాయింట్ బ్లాంక్ ఏరియాలో గన్ పెట్టి బెదిరించినట్లుగా కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చాలా సీరియస్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి ఆఫీసులో కూడా సుమంత్ డబ్బుల కోసం గన్‌తో బెదిరింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రెండు ఘటనల్లో సుమంత్‌పై ఆరోపణలు రావడంతోనే ఆయన్ను విధుల నుంచి తప్పించినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. సుమంత్ వ్యవహారం ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది. విధుల నుంచి తప్పించిన తర్వాత సుమంత్ అదృశ్యమవడంతో, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. దీంతో టాస్క్ ఫోర్స్ బృందాలు బుధవారం సాయంత్రం మంత్రి నివాసం వద్ద సడన్ సర్చ్ ఆపరేషన్ చేపట్డడం కలకలం రేపింది.
మా ఇంటికి ఎందుకు వచ్చారు..?
టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమ ఇంటికి రావడంతో మంత్రి సురేఖ తనయ సుస్మిత పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా తల్లిని టార్గెట్ చేస్తున్నారా..? అంటూ టాస్క్ ఫోర్స్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సుమంత్ చేసిన తప్పేంటి.. ఒక్క ఆధారమైనా ఉందా అంటూ ఆమె పోలీసులను ప్రశ్నించారు. ఇక్కడ ఉన్నాడని మీకెవరు చెప్పారు.. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లోకి వచ్చేస్తారా..? అంటూ మండిపడ్డారు. మేం కాంగ్రెస్ గవర్నమెంటులోనే ఉన్నామా..? ఇంకా మరేదైనా పార్టీలో ఉన్నామా అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్లడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.


