- రిమాండ్ కు నిందితుడి తరలింపు
- వివరాలు వెల్లడించిన కరీంనగర్ సీపీ
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘర్షకుర్తి గ్రామంలో ఇటీవల వృద్ధ దంపతులపై జరిగిన హత్య, హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సోమవారం వెల్లడించారు. గంగాధర పోలీసు స్టేషన్ పరిధిలోని గర్షకుర్తి గ్రామానికి చెందిన గజ్జల శంకరయ్య (76), ఆయన భార్య లక్ష్మి (70) దంపతులు ఒంటరిగా నివాసం ఉంటున్నారు. వీరికి పక్కనే వేరే ఇంటిలో నివసించే కత్తి శివ అప్పుడప్పుడు వారికి సహాయం చేస్తూ, నమ్మకాన్ని పెంచుకున్నాడు. అయితే ఆన్‌లైన్ బెట్టింగ్, పేకాట అలవాట్లతో అప్పుల్లో కూరుకుపోయిన నిందితుడు, దంపతుల వద్ద ఉన్న బంగారు పుస్తెల తాడును దోచుకోవాలన్న ఉద్దేశంతో పథకం వేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
గతంలో ముంబైలో కల్లు దుకాణంలో పనిచేసిన సమయంలో అక్కడ ఉపయోగించే మత్తు మాత్రలను దాచివుంచి, అక్టోబర్ 7న వృద్ధ దంపతులకు జ్వరం, జలుబు తగ్గేందుకు అంటూ నమ్మించి ఆ మాత్రలను ఒక్కొక్కరికి ఆరు చొప్పున నిందితుడు శివ మింగేలా చేశాడు. మాత్రలు మింగి వృద్ధులు మత్తులోకి వెళ్లిన తర్వాత లక్ష్మి మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును దొంగిలించి గ్రామంలోని బంగారం వ్యాపారి కట్ల శ్రీనివాసాచారికు అమ్మి రూ.1.85 లక్షలు నగదు తీసుకున్నాడు. దానిలో కొంత డబ్బును అప్పులు తీర్చడానికి, మిగతాదాన్ని పేకాట, బెట్టింగ్ కోసం వినియోగించినట్టు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడని సీపీ తెలిపారు.
కాగా వృద్ధులను అపస్మార స్థితిలో ఆసుపత్రికి తరలించగా, శంకరయ్య మరుసటి రోజు మృతి చెందగా, లక్ష్మి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కూడా విషమంగా ఉందని అయన తెలిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన గంగాధర పోలీసులు, అక్టోబర్ 13న మిగిలిన మత్తు మాత్రలను పారేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి రూ. 25వేల నగదు, 11 మత్తు మాత్రలు, టెక్నో మొబైల్ ఫోన్, 20.250 గ్రాముల బంగారు తాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. నిందితుడిపై హత్య, హత్యాయత్నం, దోపిడీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామని సీపీ తెలిపారు. రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో, ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్, ఏస్ఐ వంశీకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ చారి, కానిస్టేబుళ్లు జంపన్న, అరవింద్ కృషితో క్లూస్‌ను సేకరించి నిందితుడిని పట్టుకున్నారన్నారు.


