బాధితుల వద్దకే పోలీస్ సేవలు
ఆన్‌లైన్ ఎఫ్ఐఆర్‌తో వేగవంతమైన న్యాయం
జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లలో అమలు
ఇప్పటి వరకు 12 కేసులు నమోదు
ఎస్పీ మహేష్ బి. గితే
కాకతీయ, సిరిసిల్ల టౌన్: ప్రజలకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన పోలీస్ సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ కీలక ముందడుగు వేసింది. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపిన ప్రకారం, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు “ఆన్సైట్ ఎఫ్ఐఆర్” విధానాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ విధానంతో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సంఘటనా స్థలంలోనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేసే సదుపాయం కల్పించారు.
నేరం జరిగిన తరువాత శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం భారంగా మారకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ విధానం అమలులో ఉండగా, ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల వద్ద నుంచే ఫిర్యాదును స్వీకరిస్తారు. డయల్ 100కు కాల్ చేసినా లేదా నేరుగా సమాచారం ఇచ్చినా తక్షణమే స్పందించి, ట్యాబ్‌ల సహాయంతో ఆన్లైన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, గొడవలు వంటి ఘటనల్లో గాయపడిన వారికి వెంటనే వైద్యసాయం అందించి ఆసుపత్రులకు తరలించే చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఆన్సైట్ ఎఫ్ఐఆర్ విధానం ద్వారా రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దొంగతనాలు, భార్యాభర్తల వివాదాలు, వేధింపులు, అనుమానాస్పద మృతులు వంటి కేసులను సంఘటనా స్థలంలోనే తక్షణం నమోదు చేసే అవకాశం లభిస్తోంది. ఈ విధానం వల్ల బాధితులకు త్వరిత న్యాయం అందడమే కాకుండా, పోలీస్ సేవలపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.


