రూ.20 లక్షల 50 వేల విలువ గల గంజాయి స్వాధీనం..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు అరెస్ట్..
కాకతీయ, వరంగల్ బ్యూరో : కాకతీయ యూనివర్సిటీ పోలీసులు మరోసారి గంజాయి అక్రమ రవాణాపై ముట్టడి చేశారు. పక్కా సమాచారంతో సిబ్బంది సోదాలు నిర్వహించి, రూ.20 లక్షల 50 వేల విలువైన 41 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ పి. నర్సింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన రాను హోస్సైన్, నూర్ మహమ్మద్ మియా. వీరిద్దరూ కోచ్ బేహార్ జిల్లా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు. రాను హోస్సైన్ గంజాయి సరఫరాదారు కృష్ణ చంద్ర బర్మన్ వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి సికింద్రాబాద్‌లో విక్రయించేవాడు.
ఈ వ్యాపారంలో లాభాలు రావడంతో తన స్నేహితుడు నూర్ మహమ్మద్‌ను కూడా కలుపుకున్నాడు. ఇద్దరూ కలిసి గత నెలలో రూ.2 లక్షలతో 41 కిలోల గంజాయి కొనుగోలు చేసి, లగేజ్ బ్యాగుల్లో దాచుకొని రైలు మార్గంలో సికింద్రాబాద్ వైపు ప్రయాణం మొదలుపెట్టారు. మధ్యలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారన్న భయంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ వద్ద దిగిపోయి, బస్సులో హనుమకొండకు చేరుకున్నారు.
అనంతరం సికింద్రాబాద్ వెళ్ళే లారీ కోసం ముచ్చెర్ల క్రాస్ వద్ద వేచి ఉన్న సమయంలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 41 కిలోల గంజాయితో పాటు మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఇతర రాష్ట్రాల నుండి గంజాయి రవాణా చేసే వ్యక్తులపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని ఏసీపీ పి. నర్సింహారావు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో చురుకుగా వ్యవహరించిన కెయూసీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రవికుమార్, ఎస్‌ఐ ఏ. కళ్యాణ్‌కుమార్, పెట్రోలింగ్ సిబ్బందిని ఆయన అభినందించారు.


