జనగామలో పోలీసుల ఓవర్ యాక్షన్
బీఆర్ఎస్ కౌన్సిలర్‌ను అడ్డుకోవడంతో ఉద్రిక్తత
మున్సిపల్ కార్యాలయం వద్ద హఫీజ్ ఫాతిమాను అడ్డుకున్న పోలీసులు
కిడ్నాప్ ఫిర్యాదు వచ్చిందని చెప్పి కార్యాలయంలోకి అనుమతి నిరాకరణ
“నన్నెవ్వరూ కిడ్నాప్ చేయలేదు” అంటూ పోలీసులకు కౌంటర్ ఇచ్చిన కౌన్సిలర్
బీఆర్ఎస్ తరఫున గెలిచానని, పార్టీకి మద్దతు ఇస్తానని స్పష్టం
పోలీసులను దాటి కార్యాలయంలోకి వెళ్లిన హఫీజ్ ఫాతిమా
చైర్‌పర్సన్ ఎన్నిక వేళ జనగామలో రాజకీయ ఉద్రిక్తత
కాకతీయ, జనగామ : జనగామ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల సందర్భంగా పోలీసుల చర్యలు వివాదాస్పదంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హఫీజ్ ఫాతిమా కుటుంబ సభ్యులు ఆమె కిడ్నాప్ అయ్యిందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద అప్రమత్తంగా ఉండి ఆమెను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త చర్యగా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

పోలీసులకు కౌంటర్ ఇచ్చిన కౌన్సిలర్
అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నానని హఫీజ్ ఫాతిమా స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల మద్దతుతో గెలిచానని, అదే పార్టీకి మద్దతు ఇస్తానని వెల్లడించారు. పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తూ వారిని దాటి మున్సిపల్ కార్యాలయం లోపలికి వెళ్లారు. జనగామ మున్సిపాలిటీలో బలాబలాలు సమానంగా ఉండటంతో చైర్‌పర్సన్ ఎన్నిక కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఒక్కో కౌన్సిలర్ మద్దతు అత్యంత కీలకంగా ఉండటంతో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. హఫీజ్ ఫాతిమా ఘటనతో జనగామలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఎన్నికైన ప్రజాప్రతినిధిని అడ్డుకోవడం సరైంది కాదని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పోలీసుల జోక్యం అవసరం లేదని వారు పేర్కొన్నారు. ఈ ఘటనతో జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక మరింత ఉత్కంఠభరితంగా మారింది.




