ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు
వేగం ప్రాణాలకు ముప్పు : నెక్కొండ సీఐ శ్రీనివాస్ హెచ్చరిక
కాకతీయ,చెన్నారావుపేట : ఖాదర్‌పేట శివారులో తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న ప్రమాదకర మూలమలుపును పోలీసులు గుర్తించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రమాదాలను నివారించేందుకు ఆ ప్రదేశంలో హెచ్చరిక సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నెక్కొండ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, వాహనదారులు వేగవంతంగా నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మూలమలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, వేగాన్ని నియంత్రించుకోవాలని సూచించారు. ప్రాణ భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.ఖాదర్‌పేట శివారులోని ఈ మూలమలుపు వద్ద గతంలో పలు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో పోలీసులు దానిని ప్రమాదకర ప్రాంతంగా గుర్తించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజేష్ రెడ్డి సహా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


