- వెబ్‌సైట్‌పైనా మరింత లోతుగా దర్యాప్తు
- పైరసీ కేసులో కొనసాగుతున్న విచారణ
- టచ్ చేయొద్దంటూ ఘాటుగా స్పందించిన వెబ్‌సైట్..
కాకతీయ, తెలంగాణ బ్యూరో : సినిమా, ఓటీటీ పైరసీ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటీవల థియేటర్‌లో రికార్డ్ చేసే వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేస్తున్న ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు క్రమంలో ఐబొమ్మ వెబ్‌సైట్‌పై దృష్టి పెట్టడంతో దాని నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు. దానిని ఛాలెంజింగ్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆ వెబ్‌సైట్ కోసం పని చేస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్లలో ఐబొమ్మకు ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు ఓటీటీ కంటెంట్‌ను తస్కరిస్తూ నిర్వాహకులకు తలనొప్పిగా మారడంతో ఐబొమ్మని కట్టడి చేసేందుకు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఆ పైరసీ వెబ్‌సైట్ నుంచి ఓ ప్రకటన వచ్చిందటూ సోషల్ మీడియాలో వేదికగా వైరల్‌గా మారింది.
రూ.3,700 కోట్లు నష్టం
సినిమా పరిశ్రమకు సవాల్‌గా మారిన పైరసీ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. దేశంలోనే అతి పెద్దదైన ముఠాను ఛేదించి ఆరుగురిని అరెస్టు చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీని ద్వారా సినిమా ఇండస్ట్రీకి దాదాపు రూ.3,700 కోట్లు నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. గతంలో హ్యాష్ ట్యాగ్ సింగిల్ సినిమా పైరసీపై పోలీసులకు కంప్లైంట్ అందింది. దీనిపై విచారణ చేపట్టి నిందితుడిని జులై 3న రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంనకు చెందిన కిరణ్‌ను అరెస్టు చేశారు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించగా, ఆ పైరసీ ముఠా సభ్యులు నెదర్లాండ్, దుబాయ్, మయన్మార్‌లో ఉన్నట్లు గుర్తించారు.
రహస్యంగా రికార్డు
ఈటీవీ విన్ కంటెంట్‌ను పైరసీ చేసి అమ్ముకున్న మరో నిందితుడిని అరెస్టు చేశారు. ఇలా రికార్డ్ చేసి ఒరిజినల్ కంటెంట్‌ను తీసుకుని ఇతర వెబ్‌సైట్లకు ముఠా విక్రయిస్తోంది. థియేటర్లలో ప్లే అయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సైతం నేరగాళ్లు క్రాక్ చేస్తున్నారు. కొన్ని సార్లు క్రాక్ అవ్వని పక్షంలో ఏజెంట్లకు కెమెరాలు అందజేసి, రహస్యంగా రికార్డు చేయడాన్ని నేర్పిస్తున్నారు. అనంతరం ఆ ఏజెంట్లకు టికెట్లు బుక్ చేసి మరీ థియేటర్లలో సినిమాలు రికార్డ్ చేస్తున్నారు. చొక్కా జేబు, పాప్ కాన్ డబ్బా, కోక్ టిన్లలో కెమెరాలు పెట్టి చిత్రీకరిస్తున్నారు. ఏజెంట్లకు క్రిప్టో కరెన్సీ రూపంలో నిందితులు కమీషన్లు ఇస్తున్నారు. కేవలం తెలుగు సినిమాలే కాదు, తమిళ్, మళయాళం, హిందీ సినిమాలపై నేరగాళ్లు ప్రత్యేక దృష్టి పెట్టారు.


