ఇసుక రవాణాపై అక్రమ పోలీసుల ఉక్కుపాదం
మార్చిలో 120 కేసులు నమోదు.. 139 వాహనాలు స్వాధీనం
161 మందిపై చర్యలు
వివరాలు వెల్లడించిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
కాకతీయ, కరీంనగర్ : అక్రమ ఇసుక రవాణాపై కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కఠిన చర్యలు కొనసాగిస్తోంది. మార్చి నెలలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 120 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 139 వాహనాలను స్వాధీనం చేసుకుని, 161 మంది నిందితులపై కేసులు నమోదు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. అక్రమ రవాణా కారణంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడమే కాకుండా, పర్యావరణం, రోడ్డు భద్రత, ప్రజా శాంతి భద్రతలపై ప్రతికూల ప్రభావం పడుతున్నందున చర్యలు మరింత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు.
డివిజన్ వారీగా చూస్తే రూరల్ డివిజన్‌లో అత్యధికంగా 73 కేసులు నమోదై 79 వాహనాలు స్వాధీనం కాగా, 98 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు. హుజురాబాద్ డివిజన్‌లో 32 కేసులు నమోదు చేసి 48 వాహనాలు స్వాధీనం చేసుకుని 48 మందిపై చర్యలు తీసుకున్నారు. టౌన్ డివిజన్‌లో 15 కేసులు నమోదు చేసి 12 వాహనాలు స్వాధీనం చేసి 15 మంది నిందితులను గుర్తించారు. పోలీస్ స్టేషన్‌ల వారీగా కరీంనగర్ రూరల్ స్టేషన్ పరిధిలోనే అత్యధికంగా 28 కేసులు నమోదై 36 వాహనాలు స్వాధీనం కావడం గమనార్హం.

ఈ ఏడాది మార్చి వరకు కమిషనరేట్ పరిధిలో మొత్తం 245 కేసులు నమోదు కాగా, 357 వాహనాలను స్వాధీనం చేసుకుని, 422 మంది నిందితులపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ ఇసుక తవ్వకం, రవాణా, నిల్వ, విక్రయాల్లో పాల్గొనే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించాలని, సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.అక్రమ ఇసుక రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడమే కాకుండా పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. ఇలాంటి కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించము. సంబంధిత పోలీస్ స్టేషన్‌ల పరిధిలో తనిఖీలు, నిఘా మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం అని పోలీస్ కమిషనర్ తెలిపారు.


