కాకతీయ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకుని అందరి ప్రశంసలు పొందాడు. తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కనకం రాజేందర్ (40) గత ఆదివారం ఒక మహిళ ఆటోలో మరిచిపోయిన నాలుగు తులాల బంగారు ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగ్ ను తిరిగి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నాడు.
వేములవాడ నుండి కరీంనగర్‌కు వచ్చిన ఓ మహిళ గీతాభవన్ వద్ద ఆటో దిగి ఆసుపత్రికి వెళ్తూ బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయింది. వెంటనే గమనించిన ఆటో డ్రైవర్ రాజేందర్, ఆమెను దింపిన ప్రదేశానికి వెళ్లి బ్యాగ్‌ను అందజేశాడు. ఆభరణాలను ఆసుపత్రి ఖర్చుల కోసం తాకట్టు పెట్టేందుకు తీసుకెళ్తున్నట్లు బాధితురాలు తెలిపింది.
రాజేందర్ నిజాయితీని గుర్తించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం గురువారం ఆయనను కమిషనరేట్ కార్యాలయానికి పిలిపించి శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు మద్దెల రాజేందర్, పడాల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు


