కాకతీయ, బయ్యారం : మండలంలోని వెంకట్రాంపురం గ్రామంలో మూఢనమ్మకాలు, మహిళలపై అత్యచారాలు, వేధింపులు, డయల్100, బాణామతి తదితర అంశాలపై సోమవారం రాత్రి కళాజాత బృందం అవగాహన కల్పించింది. అదేవిధంగా పోలీసుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా మండలంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ రవి కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్, గంజాయి, ఆన్లైన్ గేమింగ్, సీసీ కెమెరాల ప్రాధాన్యత, మహిళలు-చిన్నారుల రక్షణ, సంబంధిత చట్టాలపై అవగాహన కల్పించారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
అపరిచిత వ్యక్తులు, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేయాలని ఎస్సై తిరుపతి సూచించారు. అనంతరం కళాజాత బృందం తన ప్రదర్శనల ద్వారా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. పోలీస్ లు శాంతి భద్రతలు కాపాడే వారని, నిత్యం ప్రజల శాంతి కోసం నిత్యం పాటు పడతారని విధుల్లో భాగంగా ఎంతో మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాజాత ఇంచార్జ్ వడ్లకుండ సతీష్, మదాకు తిరుపతి, మచ్చ పృథ్వి రాజ్, హెడ్ కానిస్టేబుల్ స్వరన్ కుమార్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


