- నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్
- దివ్యాంగులకు వీల్‌చైర్ల పంపిణీ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : సమాజ సేవలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ అన్నారు. సీసీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా దివ్యాంగులకు ఉచిత వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ స్వయంగా లబ్ధిదారులకు వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇంత మంచి సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. సమాజంలోని నిస్సహాయులకు, ముఖ్యంగా దివ్యాంగులకు అండగా నిలవడం మనందరి బాధ్యత అన్నారు.
కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా, మానవతా దృక్పథంతో ప్రజలకు సేవ చేయడంలో కూడా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థలను మనస్ఫూర్తిగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలకు హైదరాబాద్ నగర పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (శాంతిభద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ అపూర్వ రావు, వికలాంగుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


