నెలరోజులు పోలీస్ యాక్ట్ అమలు
ఫిబ్రవరి 28 వరకు ధర్నాలు, ర్యాలీలకు నిషేధం
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు
కాకతీయ, భూపాలపల్లి : శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు నెలరోజులపాటు 30, 30(ఎ) పోలీస్ యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ తెలిపారు. ఈ కాలంలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా లేదా ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో, వ్యక్తులు లేదా రాజకీయ పార్టీలను కించపరిచే వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.


