కవిత కొత్త పార్టీ !
జాగృతి పార్టీగా మారడం పెద్ద విషయం కాదు
సమయం, సందర్భం, అవసరం మేరకు నిర్ణయం
ప్రజలకు ఎలా మేలు చేయాలనేదే ఆలోచన
కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
25 నుంచి జనంబాటకు శ్రీకారం
33 జిల్లాల్లో 4 నెలలు పాటు ఈ కార్యక్రమం
యాదిగిరిగుట్టలో ప్రత్యేక పూజలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారా? అనే చర్చ కొంతకాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి కవిత మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి “జనంబాట” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం యాదగిరిగుట్ట శ్రీనరసింహస్వామిని కవిత దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత.. ప్రజలు కోరుకుంటే తప్పకుండా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుచేస్తానని అన్నారు.
25 నుంచి జనంబాట
ఈనెల 25 నుంచి తమ సొంత ఊరు నిజామాబాద్ నుంచి జనంబాట కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగాలని మొన్న తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని, ఈరోజు యాదాద్రి శ్రీలక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకున్నానని చెప్పారు.
19 సంవత్సరాలు తెలంగాణ జాగృతి కార్యకలాపాలు సాగిస్తోందని తెలిపారు. తాము ఒక ఎన్జీవోగా ఏర్పాటైనప్పటికీ… ప్రతి నిత్యం ప్రజల కోసమే మాట్లాడమని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాజకీయాలు మాట్లాడమని, ఇక్కడి ప్రజలకు ఎలా మేలు చేయాలనేదే ఆలోచన చేశామని తెలిపారు. ఈరోజు కూడా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్‌గా ఉన్నప్పటికీ… రాజకీయాలు మాట్లాడుతామని, ప్రజలకు మేలు చేయాలంటే పార్టీ ఉండాల్సిన అవసరం లేదన్నారు.
సమయం, సందర్భం బట్టి..
అయితే పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తుందని ప్రకటించారు. తమిళనాడు, ఏపీ, కేరళలో పలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని ప్రస్తావించారు. పార్టీలు ఉండటం పెద్ద విషయం కాదని, జాగృతి పార్టీగా మారడం కూడా పెద్ద విషయం కాదని… దానికి సమయం, సందర్భం, ప్రజలకు అవసరం ఉండాలని అన్నారు. పార్టీ అనే దానితో ప్రజలకు మేలు జరగాలని తెలిపారు. ప్రజల కోసమే తన పర్యటన అని చెప్పారు. జాగృతి జనం బాట 33 జిల్లాల్లో 4 నెలలు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని కవిత తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో రెండు రోజులు ఉండి… అక్కడి మేధావులను, విద్యావంతులను, విద్యార్థులను, రైతులను, మహిళలను కలిసి… అక్కడి సమస్యలను తెలుసుకుంటామని చెప్పారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకు జాగృతి జనం బాట ఒక వేదిక అవుతుందని నమ్ముతున్నట్టుగా తెలిపారు.
కొత్త పార్టీ దిశగా అడుగులు !
గత కొంతకాలంగా చోటుచేసుకున్న పరిణామాలు కవిత కొత్త పార్టీ పెట్టనున్నారనే ఊహాగానాలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తాజాగా జాగృతి జనం బాట పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు. ఈ యాత్ర తర్వాత కవిత కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉందనే విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కవిత మీడియాతో మాట్లాడుతూ… పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తుందని ప్రకటించడం చర్చనీయమైంది.



