కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలోని మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏటా రూ. 6వేల ఆర్థిక ప్రయోజనం లభిస్తోంది. అంటే ఈ మొత్తం నేరుగా రైతులు బ్యాంకు అకౌంట్లో జమ అవుతోంది. ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బులను 2వేల చొప్పున జమ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ స్కీమ్ కు సంబంధించిన ఓ తాజా అప్ డేట్ ను చూద్దాం.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో 11వ విడత తర్వాత పీఎం కిసాన్ నుంచి ఎలాంటి డబ్బు అందని రైతులు దాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రధాన మంత్రి మోదీ ఈ నెల ఆగస్టు 2న పీఎం కిసాన్ 20వ విడతను విడుదల చేశారు. అందువల్ల వాయిదా డబ్బులు రాకుండా నిలిచిపోయిన రైతులు డేటాను సరిదిద్దడం వల్ల 12 నుంచి 20వ విడత వరకు 18వేలు పొందవచ్చు. దీని కోసం మీరు కొన్ని పత్రాలను మళ్లీ ధ్రువీకరించుకోవాలి. ఆధార్ సీడింగ్, ఈకెవైసీ, ఇతర ఫార్మాలిటీలను సకాలంలో పూర్తి చేయని రైతుల వాయిదాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ చెప్పారు. ఇప్పుడు రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే ఆగిపోయిన అన్ని వాయిదాలను వారికి ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలిపారు.
వాయిదాల జారీ ఆగిపోవడానికి ప్రధాన కారణం వ్యవసాయ మంత్రిత్వ శాఖ తీసుకువచ్చిన కొత్త నిబంధనలు. 2022 ఆగస్టు నుండి నవంబర్ వరకు ఇచ్చిన 12వ విడతలో రైతులు తప్పనిసరిగా భూమిలో విత్తనాలు వేశారని రుజువు చూపించాల్సి వచ్చింది. ఆ తరువాత, 2022 డిసెంబర్ నుండి 2023 మార్చి మధ్య ఇచ్చిన 13వ విడతలో ఆధార్ ఆధారిత చెల్లింపు విధానంను అమలు చేశారు. 2023 ఏప్రిల్ నుండి జూలై వరకు వచ్చిన 15వ విడతలో అయితే e-KYC తప్పనిసరి చేశారు.
ఈ కొత్త సాంకేతిక విధానాల వలన, కొన్ని రాష్ట్రాల్లో రైతుల సంఖ్య తాత్కాలికంగా తగ్గినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయానికి పూర్తికాకపోయిన రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించిందని స్పష్టం చేసింది. అయితే, తక్షణ చర్యలు తీసుకున్న రాష్ట్రాల్లో మాత్రం రైతులు పెద్ద ఇబ్బందులు ఎదుర్కోలేదని అధికారులు తెలిపారు.
రైతులకు ఇచ్చే ఆర్థిక సాయం నేరుగా వారి ఖాతాలోకి చేరేలా ఈ పథకం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానాన్ని అనుసరిస్తోంది. దీని కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా ధృవీకరించబడిన రైతుల వివరాలను PM-Kisan పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు.
పథకం మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండేందుకు ప్రభుత్వం అనేక సాంకేతిక సవరణలు చేసింది. ఇందులో ముఖ్యంగా :
PFMS, UIDAI, ఆదాయపు పన్ను శాఖల డేటాను కలపడం,
రైతుల వివరాలను రేషన్ కార్డ్ డేటాబేస్‌తో సరిపోల్చడం,
మరణించిన వారి ఆధార్ నంబర్లను నిలిపివేయడం,
డూప్లికేట్ లేదా నకిలీ ఖాతాలను గుర్తించి తొలగించడం వంటి చర్యలు ఉన్నాయి.
ఈ మార్పుల వలన పథకం ద్వారా సహాయం నిజంగా అర్హులైన రైతులకే చేరేలా ప్రభుత్వం నిబంధనలు కట్టుదిట్టం చేసింది.


