కాకతీయ, భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ హెడ్‌క్వార్టర్స్ హాస్పిటల్ (100 పడకల హాస్పిటల్)లో ప్లేట్లెట్స్ మిషన్‌ను వెంటనే వినియోగంలోకి తేవాలని ఏం ఆర్ పీ ఎస్ – టీ ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య మాదిగ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలోనే రెండు సంవత్సరాల క్రితం ప్లేట్లెట్స్ మిషన్ కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఒక ప్యాకెట్ ప్లేట్లెట్స్‌కు సుమారు 15 వేల రూపాయలు, కనీసం రెండు ప్యాకెట్లకు 30 వేల రూపాయల ఖర్చు అవుతుందని, పేద ప్రజలకు ఇది భరించలేని భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఈ హాస్పిటల్‌కు అనేక ప్రాంతాల ప్రజలు ఆధారపడుతున్నారని, హనుమకొండ, వరంగల్ వరకు వెళ్లి అధిక ఖర్చు పెట్టడం సాధ్యం కాని పేదల సమస్యను హాస్పిటల్ సూపరిండెంట్ విస్మరిస్తున్నారని రాజయ్య మాదిగ సూటిగా ప్రశ్నించారు. కేంద్రం నుండి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మిషన్‌ను వాడకంలోకి తేవడంలేదని ఆరోపించారు.
కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే తక్షణమే జోక్యం చేసుకుని ప్లేట్లెట్స్ మిషన్‌ను వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏం ఆర్ పీ ఎస్-టీ ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగ, నియోజకవర్గ ఇంచార్జి శీలపాక హరీష్ మాదిగ, మలహార్ మండల అధ్యక్షులు మంత్రి రాజబాబు మాదిగ, మండల నాయకులు కళ్ళేకూరి గణేష్ మాదిగ పాల్గొన్నారు.


