- 15 మాత్రలు ఒకేసారి భోజనంలో కలిపిన భార్య
- కరీంనగర్ లో హత్య కేసును చేధించిన పోలీసులు
- దర్యాప్తులో షాక్ గురి చేసే నిజాలు వెలుగులోకి
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కత్తి సురేష్ హత్యకేసును కరీంనగర్ పోలీసులు చేధించారు. తాగుడుకు బానిసై వేధింపులకు పాల్పడుతున్న కత్తి సురేష్‌ను (36) భార్య మౌనిక మద్యంలో నిద్రమాత్రలు కలిపి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాకా.. కిటీకి చీరతో ఉరివేసి చంపేసినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించారు. ఈ హత్యకు పరోక్షంగా సహకరించిన మొత్తం ఐదుగురిని కూడా అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. సెప్టెంబరు 17న కరీంనగర్ జిల్లాకేంద్రంలో అనుమానాస్పద స్థితిలో కత్తి సురేష్ మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు భార్యే హంతకురాలిగా గుర్తించారు. ఈ కేసులో మృతు భార్యతో పాటు మొత్తం ఆరుగురు నిందితులను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను గురువారం కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన కత్తి సురేష్ (36) కు 2015లో మౌనిక (29)ను ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.
భర్త వేధింపులతో హత్యకు ప్లాన్..
సురేష్ మద్యానికి బానిస కావడంతో ఇల్లు గడవడమే కష్టంగా మారింది. ఈక్రమంలోనే ఆమెకు దొమ్మాటి అజయ్ (28)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త తరచూ డబ్బు కోసం వేధించడమే కాకుండా తన స్వేచ్ఛకు అడ్డు వస్తున్నాడనే నెపంతో సురేష్‌ను హత్య చేయాలని మౌనిక పథకం రచించింది. ఇందుకు తన సమీప బంధువు అరిగే శ్రీజ (32)తో ఈ విషయంపై చర్చించింది. తనకు పరిచయస్తుడైన మెడికల్ ఏజెన్సీ యజమాని పోతు శివకృష్ణ (27)కు మౌనికను శ్రీజ పరిచయం చేసింది. వీరితో పాటు తన మిత్రురాలు వేముల రాధ అలియాస్ నల్ల సంధ్య (39), ఆమె భర్త నల్ల దేవదాస్ (49)లకు సైతం పరిచయం చేసింది. సురేష్‌ను చంపేందుకు రకరకాల ఆలోచనల పంచుకున్నారు.
భోజనంలో 15 వయాగ్రా మాత్రలు..
ఒక రోజు సురేష్‌కు భోజనంలో 15వయాగ్రా మాత్రలను ఒకేసారి భోజనంలో కలిపి ఇవ్వడంతో భోజనం ఏదో వాసన వస్తోందని తినడానికి సురేష్ నిరాకరించాడు. అయితే గత నెల 17న మెడికల్ ఏజెన్సీ యజమాని శివకృష్ణ సూచన మేరకు, టెల్మికిండ్-(హెచ్80) (బీపీ మందులు), ట్రైకా (నిద్ర మాత్రలు) మిశ్రమాన్ని మద్యంలో కలిపి ఇవ్వడంతో సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత చీరను కిటికీ గ్రిల్‌కు కట్టి దాన్ని సురేష్ మెడకు చుట్టి గట్టిగా లాగి ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం ఆమె తన అత్తమామలకు ఫోన్ చేసి, లైంగిక చర్య సమయంలో భర్త స్పృహ కోల్పోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది.
కుటుంబ సభ్యుల అనుమానంతో వెలుగులోకి..!
ఘటన జరిగిన తీరుపై సురేష్ కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శాస్త్రీయ ఆధారాలతో సహా టెక్నికల్ ఎనాలసిస్‌లో హత్యగా నిర్ధారణ కావడం, దర్యాప్తులో మౌనికతో పాటు మిగతా ఐదుగురు నిందితులు కూడా హత్యకు కుట్ర పన్నినట్లు ఒప్పుకున్నారని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. నిందితుల మధ్య జరిగిన చాట్‌లు, వాడిన మందులు, మద్యం బాటిళ్లు తదితర అంశాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి, వారిని న్యాయపరమైన కస్టడీకి అప్పగించడం జరిగిందని తెలిపారు. ఈ కేసు ఛేదనలో కరీంనగర్ ఏసీబీ వెంకటస్వామి, ఇన్‌స్పెక్టర్ సృజన్ రెడ్డి, వారి బృందం కీలక పాత్ర పోషించడంతో వారి దర్యాప్తును కమిషనర్ గౌస్ ఆలం అభినందించారు.


