పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..!
పీకే అంచనాలను తారుమారు చేసిన ఓటర్లు
పోస్టల్ బ్యాలెట్లలో ఆశ, ఫలితాల్లో నిరాశ
కాకతీయ, జాతీయం: దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్ కిషోర్ (పీకే) అనేక రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చిన వ్యక్తిగా ఖ్యాతి సంపాదించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు.. పలు రాష్ట్రాల్లో పార్టీలు విజయం సాధించేందుకు తన సలహాలు, మైక్రో స్ట్రాటజీలు కీలకమని ఆయన టీమ్ చెప్పుకుంటూ వచ్చింది. కానీ, సొంత రాష్ట్రం బీహార్‌లో ‘జన్ సురాజ్’ అనే ప్రయోగంతో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన పీకే, ఈసారి మాత్రం తన లెక్కల్లో ఘోరంగా తడబడ్డారు.
బీహార్‌లో ఈసారి మార్పు ఖాయం.. ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంతో అసంతృప్తిగా ఉన్నారు.. జన్ సురాజ్ పార్టీ పలు ప్రాంతాల్లో అసాధారణ ప్రజాదరణ పొందుతోందని ఎన్నికలకు ముందు నుంచి పీకే తెగ ప్రచారం చేశారు. ఎన్డీఏ కూటమి ఘోరంగా ఓటమి చెందుతుందని ఆయన పబ్లిక్‌గా ఎన్నోసార్లు చెప్పారు. అయితే కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే పీకే అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఎన్నికల రోజు తెల్లవారుజామున పోస్ట్ బ్యాలెట్ల లెక్కింపులో జన్ సురాజ్ పార్టీ రెండు స్థానాల్లో స్వల్ప ఆధిక్యం సాధించగా, పీకే అనుచరులలో కొంత ఉత్సాహం కనిపించింది.
అయితే అది ఎక్కువసేపు నిలువలేదు. ఆ ఆధిక్యం కొన్ని రౌండ్లలోనే ఆవిరైపోయి, తుది గమ్యానికి వచ్చేసరికి జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేని దుస్థితి ఎదురైంది. తుది ఫలితాల్లో ఎన్డీఏ కూటమి హవా చూపించింది. స్పష్టమైన ఆధిక్యం కనబర్చి అధికారాన్ని పదిలం చేసుకుంది. సర్వేలు సూచించినట్లుగానే, బీహార్ ఓటర్లు పెద్ద మార్పు అవసరం లేదని, ప్రస్తుత కూటమితోనే కొనసాగాలని సంకేతం ఇచ్చారు.
ఇక తన సొంత రాష్ట్రంలోనే పీకే చేసిన అంచనాలు విఫలమవడం ఆయన స్ట్రాటజిక్ ఇమేజ్‌కు భారీ దెబ్బ. జన్ సురాజ్ పార్టీ మరింత బలపడాలంటే ప్రసంగాలు, యాత్రలు, ప్రామిసెస్ మాత్రమే కాకుండా, గ్రామ స్థాయి బూట్స్-ఆన్-గ్రౌండ్ ఆర్గనైజేషన్‌ను నిర్మించాల్సిన అవసరం ఉన్నట్లు ఈ ఫలితాలు స్పష్టంగా చూపించాయి. మొత్తానికి పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో పూర్తిగా క్రాష్ అవ్వడంతో సామాజిక మాధ్యమాల్లో ఆయనపై భారీ ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి.


