సిరిసిల్ల పీఠంపై గులాబీ జెండా
జిందం కళా చక్రపాణి వరుసగా రెండోసారి ఎన్నిక
వైస్ చైర్మన్‌గా దార్ల సందీప్‌కు అవకాశం
క్యాంపు రాజకీయాల తర్వాత బీఆర్ఎస్ నిర్ణయం ఖరారు
రాష్ట్రంలో కాంగ్రెస్… సిరిసిల్లలో బీఆర్ఎస్ పాలన కొనసాగింపు
పట్టణ అభివృద్ధి నిధులపై ప్రజల దృష్టి
వైస్ చైర్మన్ ఎంపికపై పార్టీ లోపల అసంతృప్తి చర్చ
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల మున్సిపల్ పీఠంపై గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు సోమవారం తెరపడింది. మున్సిపల్ చైర్మన్‌గా జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్‌గా దార్ల సందీప్ ఏకగ్రీవంగా ఎన్నికవడంతో కొత్త పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. దీంతో సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మళ్లీ అధికారాన్ని కొనసాగించింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికపై బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర కసరత్తు జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పర్యవేక్షణలో క్యాంపులో ఉన్న 27 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చివరకు జిందం కళా చక్రపాణిని చైర్మన్‌గా, దార్ల సందీప్‌ను వైస్ చైర్మన్‌గా ఖరారు చేశారు. సోమవారం ఉదయం క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న కౌన్సిలర్లు ముందుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జరిగిన ఎన్నికలో జిందం కళా చక్రపాణి వరుసగా రెండోసారి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. దార్ల సందీప్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఎన్నికతో బీఆర్ఎస్ మూడోసారి సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్‌పై పట్టు సాధించింది.

రాష్ట్రంలో కాంగ్రెస్… పట్టణంలో బీఆర్ఎస్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, సిరిసిల్ల మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీతో పాలనలో కొనసాగుతోంది. మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్‌కు ఆరుగురు కౌన్సిలర్లు, బీజేపీకి ఐదుగురు సభ్యులు, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. ఈ రాజకీయ సమీకరణాల మధ్య బీఆర్ఎస్ మున్సిపల్ పాలన కొనసాగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిరిసిల్ల పట్టణంలో రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పట్టణ సుందరీకరణ వంటి అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కీలకం. రాష్ట్రంలో కాంగ్రెస్, పట్టణంలో బీఆర్ఎస్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో అభివృద్ధి పనులకు నిధుల సాధనపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. రాజకీయ భేదాలు పక్కనపెట్టి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని స్థానికులు కోరుతున్నారు.

వైస్ చైర్మన్ ఎంపికపై అసంతృప్తి
వైస్ చైర్మన్ ఎంపికపై పార్టీ లోపల వివాదం తలెత్తింది. క్యాంపులో బుర్ర నారాయణ గౌడ్ పేరును పరిశీలించినట్లు ప్రచారం జరిగినప్పటికీ, తుదకు దార్ల సందీప్‌ను వైస్ చైర్మన్‌గా ఎంపిక చేయడం కొందరిలో అసంతృప్తికి దారితీసింది. తనను పక్కనపెట్టారని భావించిన బుర్ర నారాయణ గౌడ్ పార్టీ అధిష్టానం నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పదవుల పంపిణీలో సమీకరణాలు ప్రభావం చూపుతున్నాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిణామం బీఆర్ఎస్లో అంతర్గత అసంతృప్తికి దారి తీస్తుందా లేక నాయకత్వం త్వరలోనే స్పష్టత ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. వరుసగా రెండోసారి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జిందం కళా చక్రపాణికి పట్టణ అభివృద్ధి, నిధుల సాధన ప్రధాన సవాలుగా మారగా, కొత్త పాలకవర్గం పనితీరుపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.


