- ఉర్సు దర్గా ప్రాంతంలో రాత్రికి రాత్రే వెలసిన డబ్బా
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజా సంఘాలు

కాకతీయ, వరంగల్ సిటీ : కరీమాబాద్ ఉర్సు దర్గా ప్రాంతంలో జ్యోతిరావు ఫూలే దంపతుల కాంస్య విగ్రహాల నిర్మాణం జరగాల్సిన స్థలం వివాదాస్పదంగా మారింది. గత నెల 20వ తేదీ అర్ధరాత్రి ఓ దుండగుడు జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేయగా బీసీ సంఘాలు ఆగ్రహం చేసి నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. కాగా, నాడు విగ్రహాన్ని ధ్వంసం చేసిన స్థలంలోనే ఫూలే దంపతుల కాంస్య విగ్రహాలను తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పనులను ప్రారంభించారు. ఫూలే విగ్రహ కమిటీ బాధ్యుల ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణం కోసం సిమెంట్, బ్రిక్స్, ఇసుక తదితర సామగ్రి ఇప్పటికే సిద్ధంగా చేశారు.
తాజాగా ఆదివారం రాత్రికి రాత్రే ఆ స్థలంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తి డబ్బా కొట్టు పెట్టి ఆ స్థలాన్ని కబ్జా చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై స్థానిక బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న స్థలాన్ని కబ్జా చేయడం సిగ్గుచేటన్నారు. వెంటనే విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నాలను మానుకోవాలని వారు హెచ్చరించారు. వెంటనే మున్సిపల్ అధికారులు, పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు సైతం డిమాండ్ చేస్తున్నారు.


