ఆస్పత్రి కార్మికుల సమస్యలపై కవితకు వినతిపత్రం
17 వేల మంది కార్మికులను ఐఎఫ్ఎంఎస్‌లో చేర్చాలని డిమాండ్
కాకతీయ, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్, సూపర్వైజర్స్ మెడికల్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు *కల్వకుంట్ల కవిత*కు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సుమారు 17 వేల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు తక్కువ వేతనాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కుర్రి సైదయ్య వివరించారు. ఏప్రిల్ నుంచి అమలవుతున్న ఐఎఫ్ఎంస్ విధానంలో ఈ కార్మికులను చేర్చకపోవడం అన్యాయమన్నారు. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలి, ఐఎఫ్ఎంస్ ద్వారా నేరుగా జీతాలు జమ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, మహిళా కార్మికులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి, డబుల్ పీఎఫ్ రద్దు చేసి సింగిల్ పీఎఫ్ అమలు చేయాలి, ఈఎస్ఐ తప్పనిసరి చేయాలి, ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షల పరిహారం, కుటుంబ సభ్యుడికి ఉద్యోగం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. విషయాన్ని విన్న కవిత… సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి ఐఎఫ్ఎంస్‌లో చేర్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొన్నారు.


