అధిక యూరియాతోనే తెగుళ్లు
అవసరానికి మించి వాడితే నేల సారానికి నష్టం
రైతులు ఆందోళన చెందవద్దు : వ్యవసాయ అధికారి వినయ్‌కుమార్
కాకతీయ, నర్సింహులపేట : పంటలకు అవసరమైనంత మేరకే యూరియా వాడాలని, అధికంగా వాడితే తెగుళ్లు, వ్యాధులు పెరుగుతాయని వ్యవసాయశాఖ అధికారి వినయ్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం నర్సింహులపేట మండలంలోని వివిధ యూరియా పంపిణీ కేంద్రాలను ఆయన సందర్శించి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక యూరియా వాడకం వల్ల రసం పీల్చే తెగుళ్లు పెరగడమే కాకుండా నేల సారవంతం దెబ్బతింటుందని, నేల చౌడుగా మారుతుందని తెలిపారు. దీంతో పాటు నీటి, వాయు కాలుష్యం కూడా పెరుగుతుందని అన్నారు. రైతులు యూరియా కొరతపై ఆందోళన చెందవద్దని, అవసరానికి మించి వినియోగించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దనాగరం సర్పంచ్ మందుల రఘు, భూక్యా హరిలాల్, శేరి రామకృష్ణ, పోలీస్ సిబ్బంది, ఆగ్రోస్ నిర్వాహకులు మదు, వ్యవసాయ విస్తరణ అధికారులు శరత్, కళ్యాణి, జీపీవోలు పాల్గొన్నారు.


