అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
భార్య ఫిర్యాదుతో కేసు నమోదు, దర్యాప్తు
కాకతీయ / నెల్లికుదురు : నెల్లికుదురు మండల కేంద్రంలో సోమవారం చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రానికి చెందిన వీరగాని ఉప్పలయ్య (45) అదే గ్రామంలోని పులికుంట చెరువు సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు గతంలో తన పెద్దమ్మ వరుస అయిన వీరగాని రాధమ్మ హత్య కేసులో జైలుకు వెళ్లి శిక్ష అనుభవించి తిరిగి గ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి రాధమ్మ హత్య విషయంలో గ్రామానికి చెందిన వీరగాని వెంకన్న, సుదగాని ఉపేందర్‌లతో తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. వీరు ఎప్పుడైనా తనను చంపవచ్చన్న భయంతో ఉప్పలయ్య ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే మృతుడి భార్య సోమక్క తన భర్తను సంబంధిత ఇద్దరు వ్యక్తులు హత్య చేసి ఉండవచ్చని, లేదా ఇతర అనుమానాస్పద కారణాలతో మృతి చెందిన అవకాశం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


