తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: వెలికట్ట సర్పంచ్ శ్రీనివాస్
కాకతీయ, తొర్రూరు : వెలికట్ట గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు గ్రామ సర్పంచ్ బందు శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని వెలికట్ట గ్రామ శివారు పాల కేంద్రం సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బోరు మోటార్‌ను ఏర్పాటు చేసి తాగునీటి సరఫరాను ప్రారంభించారు. గ్రామంలోని మొదటి వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి బోరు మోటార్ బిగించేందుకు పంచాయతీ పాలకవర్గం తొలి తీర్మానం చేయగా, దాని అమలులో భాగంగా సర్పంచ్ శ్రీనివాస్ స్వయంగా ప్రారంభించారు. దీంతో స్థానికులకు తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలు నమ్మకంతో ఎన్నికల్లో గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన ప్రతి అభివృద్ధి పనికి తీర్మానాలు చేసి, వాటిని అమలులోకి తీసుకొస్తామని తెలిపారు. గ్రామ ప్రజలకు నిత్యం శుద్ధ తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
గ్రామాభివృద్ధికి హామీ
తాగునీటి సమస్యతో పాటు ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఐదేళ్లపాటు ప్రజల సహకారం అందించాలని కోరారు. అనంతరం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సత్కరించారు. అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అల్లంనేని అనిల్ రావు, వార్డు సభ్యులు బందు సంపత్ కుమార్, దీకొండ బాలకృష్ణ, యాసారపు సోమయ్య, వీరమనేని రమేష్ రావు, అల్లం వెంకన్న, మడిపెద్ది సుభద్ర, కొమ్ము శారద, భోగ సుజాతతో పాటు గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.


