ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచాలి
నేరాల నియంత్రణకు కృషి చేయాలి
డయల్ 100 కాల్స్‌కు తక్షణ స్పందించాలి
ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్
కాకతీయ, దుగ్గొండి : శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు పోలీసులు నిరంతరం కృషి చేయాలని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సూచించారు. మంగళవారం దుగ్గొండి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ గార్డు గౌరవ వందనం స్వీకరించిన డీసీపీ అనంతరం పరేడ్‌ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది కిట్స్, ఆర్టికల్స్‌తో పాటు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, జనరల్ డైరీ, చార్జ్‌షీట్లు, కేస్ డైరీలను సమగ్రంగా పరిశీలించారు. కేసుల నమోదు, విచారణలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు. మహిళా సహాయక కేంద్రం, సన్నిహిత కేంద్రం కార్యకలాపాల నిర్వహణ తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు వెంటనే సహాయం అందేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.
ప్రజాసేవకు ప్రాధాన్యం
డయల్ 100కు ప్రజల నుంచి వచ్చే కాల్స్‌కు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి తక్షణమే చేరుకునేలా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచాలని సూచించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు విధులు నిర్వర్తించిన సిబ్బందిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, దుగ్గొండి సీఐ సాయి రమణ, ఎస్సై రావుల రణధీర్ రెడ్డి, ఏఎస్సై ప్రభాకర్‌తో పాటు కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


