కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ప్రజల ముద్ర
సంక్షేమ పథకాల అమలుపై విశ్వాసం
బీఆర్‌ఎస్ పాలనపై ప్రజల తిరస్కారం
గ్రామాభివృద్ధికే ప్రజల మద్దతు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కాకతీయ, జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్న తీరుకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే నిదర్శనమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులు సాధించిన విజయాలు ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నాయని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారని అన్నారు.
గత పదేళ్ల కాలంలో ‘నేనే రాజు, నేనే మంత్రి’ అన్న ధోరణితో టీఆర్‌ఎస్ అగ్రనాయకులు వ్యవహరించి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి ప్రజలపై ఆర్థిక భారం మోపారని విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినా ప్రజలు వాటిని తిరస్కరించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల్లో నాలుగు ప్రధాన హామీలను ఇప్పటికే అమలు చేస్తూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి చెప్పారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపేందుకే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించామని, ఆ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వ పనితీరును ఆదరించి స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్యలు పాల్గొన్నారు.


