ప్రజల చూపు బీజేపీ వైపు
నర్సంపేటలో 40 కుటుంబాల చేరిక
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి విమర్శలు
కాకతీయ, నర్సంపేట టౌన్ : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో బీజేపీలోకి 40 కుటుంబాలు చేరాయి. పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అధ్యక్షతన, రాడ్ బెండింగ్ సంఘం అధ్యక్షుడు కట్యాల రవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ 10 ఏళ్ల పాలనలో దళిత బంధు, డబుల్ బెడ్‌రూమ్, ఇంటికి ఒక ఉద్యోగం వంటి హామీలు ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో విఫలమైందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల కోసమే పేరుకే అభివృద్ధి చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, బీజేపీ వైపే ప్రజల చూపు ఉందని డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.


