కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్యను తరిమిన ప్రజలు
మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత
రోడ్డు నిర్మాణ పనుల్లో ఆలస్యంతోనే ప్రమాదాలంటూ నిరసన
కాకతీయ, రంగారెడ్డి : మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే కాలె యాదయ్య పైకి ప్రజలు రాళ్ల ఎత్తడంతో ఆయన అక్కడి నుంచి త్వరగా బయట పడ్డారు.
ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని, నిత్యం ఈ ప్రాంతంలో రోడ్డుపై రక్తం పారుతోందని ప్రజలు మండిపడ్డారు. ఎమ్మెల్యేకు నిరసన వ్యక్తం చేసే క్రమంలో పోలీసులకు ప్రజలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బస్సును ఇక్కడ నుంచి తొలగించవద్దని ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో పోలీసులు కాలె యాదయ్యను వెళ్లిపోవవాలని సూచించారు. దీంతో ఆయన జనంలోంచి బయట పడి కారులో వెళ్లిపోయారు.


