కాంగ్రెస్ హామీలపై ప్రజలు ఆలోచించాలి
ఇచ్చిన మాటలు అమలు కాలేదు
కారు గుర్తుకే ఓటేయాలి : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కాకతీయ, జమ్మికుంట: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజలు గట్టిగా ఆలోచించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. జమ్మికుంట పట్టణంలోని అబాది జమ్మికుంట గ్రామంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల వార్డు స్థాయి సమావేశాల్లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. “కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఒక్క హామీ కూడా అమలు కాలేదు. 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది” అని ఎమ్మెల్యే మండిపడ్డారు. రైతుబంధు, తులం బంగారం, వృద్ధులకు రూ.4,000 పెన్షన్, వడ్లకు రూ.500 బోనస్, మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం, బతుకమ్మ చీరలు వంటి హామీలన్నీ గాలికొదిలేశారని విమర్శించారు. కాంగ్రెస్ పాలన పూర్తిగా బకాయిల పాలనగా మారిందని, రైతుబంధు, వడ్ల బోనస్, ఫీజు రీయింబర్స్‌మెంట్, షాదీ ముబారక్, పెన్షన్లు తదితర చెల్లింపులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువతకు ఈ ప్రభుత్వం ఘోర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను వారి హామీలపై ప్రజలు ప్రశ్నించాలని, మాయమాటలు నమ్మవద్దని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జమ్మికుంటలో నిర్వహించిన 13, 14వ వార్డుల సమావేశాలు విజయవంతంగా జరిగాయని తెలిపారు. తెలంగాణను కాపాడుకోవాలంటే, జమ్మికుంట అభివృద్ధి కొనసాగాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ మారేపల్లి సుదీర్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


