కాంగ్రెస్కు పరకాల ప్రజలు బుద్ధి చెప్పాలి
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి పరకాలలో ఎన్నికల ప్రచారం
కాకతీయ, పరకాల : కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలకు పరకాల ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు. పరకాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం పట్టణంలోని 1, 2, 3, 12, 13, 14, 15, 22 వార్డుల్లో వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించిందని, ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరకాల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి పరకాలలో గులాబీ జెండా ఎగురవేయాలని ప్రజలను కోరారు. ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయా వార్డుల బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బీజేపీకి షాక్… బిఆర్ఎస్లో చేరిన సుష్మ కృపేందర్
పరకాల మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. 14వ వార్డు బీజేపీ అభ్యర్థి బొల్లెడ్ల సుష్మ కృపేందర్ పార్టీకి రాజీనామా చేసి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)లో చేరారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సమక్షంలో ఆమెకు పార్టీ కండువా కప్పి బిఆర్ఎస్లోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరకాల పట్టణంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందించిన పారదర్శక పాలనకు ఆకర్షితులై తాను బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు సుష్మ కృపేందర్ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పరకాలలో బిఆర్ఎస్ బలం రోజురోజుకు పెరుగుతోందని, ఇతర పార్టీల నాయకులు స్వచ్ఛందంగా బిఆర్ఎస్లో చేరడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


