కాంగ్రెస్ రాగానే ప్రజలకి కష్టాలు
ఓడిపోగానే పారిపోయిన వ్యక్తి మాటలు నమ్మకండి
బీఆర్ఎస్ కే గ్రామీణుల ఓటు
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేడి పెరుగుతోంది. కమలాపూర్ మండలంలోని కాన్పర్తి, శ్రీరాములపల్లి, అంబాల, గూడూరు, భీంపల్లి గ్రామాల్లో నిర్వహించిన పాదయాత్రలు, రోడ్‌షోలలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సమస్యల్లో కూరుకుపోయిందని, కేసీఆర్ ముందే చెప్పిన మోసపోతే గోసా పరిస్థితినే ప్రజలు అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతానికే నాయకుడినని చెప్పుకుంటూ ఓటమి వెంటనే మరొక ప్రాంతానికి వెళ్లి పోటీ చేసే వ్యక్తి మాటలను ప్రజలు నమ్మరాదని స్పష్టం చేశారు. నేను ఈ నేలనె పట్టుకుని నిలబడిన వాడిని ప్రజల సమస్యల కోసం ఎప్పుడూ పోరాడాను అని గుర్తు చేశారు. అమలు చేయలేని వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, సంక్షేమ పథకాలపై కోతలతో ప్రజల జీవితాలు కష్టాల్లో మునిగిపోయాయని తెలిపారు. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలే ఇప్పటికీ ప్రజలకు అండగా నిలుస్తున్నాయని వివరించారు.కల్యాణలక్ష్మి ₹1,16,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినా ఇప్పటికీ అమలు కాలేదని, మహిళలకు ₹2500, వంటగ్యాస్‌పై ₹500 సహాయం, వికలాంగులకు ₹6000, వృద్ధులకు ₹4000 హామీలు వాయిదాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి కూడా కాంగ్రెస్ పాలనలోనే వచ్చిందని అన్నారు.గ్రామాల అభివృద్ధి కోసం బి ఆర్ ఎస్నే నమ్మాలని ప్రజలను కోరుతూ, కమలాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో బి ఆర్ ఎస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.గ్రామాల అభివృద్ధి నా బాధ్యత బి ఆర్ ఎస్ సర్పంచ్ గెలిస్తేనే అభివృద్ధి పనులు వేగంగా సాగుతాయి అని కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు.


