దొంగతనాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు
– రోజుకో కొత్త కోణంలో వరుస దొంగతనాలు..
– ఖానాపురం గ్రామాన్నే టార్గెట్ చేస్తూ దొంగల స్కెచ్..
– మొన్న కోళ్లు.. నిన్న గోర్లు.. నేడు టూ-వీలర్…
– పనిచేయని సీసీ కెమెరాలు
– వరుస దొంగతనాలతో భయపడుతున్న గ్రామ ప్రజలు…
కాకతీయ ఖానాపురం : వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో గత నెల రోజులుగా జరుగుతున్న వరుస దొంగతనాలతో ఖానాపురం గ్రామ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తెలిసిన వారి పనే అన్నట్టుగా రోజుకో కొత్త కోణంలో దొంగలు దొంగతనాలు చేస్తూ కొన్ని చోట్ల సీసీ కెమెరాలకు సైతం చిక్కకుండా తమ హవా నడిపిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అనుమానం రాకుండా ఉదయం గ్రామంలో తిరుగుతూ చోరీకి స్కెచ్ వేసి మరి పక్కాగా దొంగలు వారి ప్లాన్ ను అమలు చేస్తూ మా రూటే సపరేటు అంటూ పోలీసులకు సవాల్ విసిరుతున్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో వారు ఇదే అదునుగా భావించి రోజుకు ఒక ఏరియాలో దొంగతనాలు చేస్తూ అందిన కాడికి దోచుకోవడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్న పరిస్థితులు ఖానాపురం మండలంలో కనబడుతున్నాయి. ఖానాపురం గ్రామ శివారు పెద్దమ్మ గడ్డ గ్రామంలో గుగులోతు నరసింహ కు చెందిన లక్ష రూపాయల విలువగల ఆరు గొర్రె పొట్టేలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు దీనిపై బాధితుడు కేసు సైతం పెట్టినట్లు తెలిపాడు. కేసు విచారణలో ఉండగానే మళ్లీ తనకు సంబంధించిన 20 వేల రూపాయల విలువ గల గొర్రెను గత రెండు రోజుల క్రితం దొంగ దర్జాగా వచ్చి ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాలు సైతం రికార్డ్ అయింది. అదే గ్రామంలో కోళ్లను సైతం ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల కవ్వింపు చర్యలకు ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడంతో వారు తమ రూట్ ను మార్చి తాజాగా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన మడత బిక్షపతి కుమారుడికి చెందిన పల్సర్ బైక్ సైతం ఎత్తికెళ్ళినట్లు దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితుడు తెలిపారు.
పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలి
ఖానాపురం గ్రామంలో వరుస దొంగతనాలతో దొంగలు ఈజీ మనీ కోసం అందిన కాడికి దోచుకోవడంకు అడ్డుకట్ట వేయకపోతే దొంగతనాలకు అడ్డుగా వస్తున్నారని మనుషుల ప్రాణాలు సైతం తీసే అవకాశం ఉంటుందని కావున పోలీసులు దొంగలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


