పెండింగ్ ఫిర్యాదులను తక్షమే పరిష్కరించాలి
ప్రజా సమస్యలపై న్యాయవిచారణ సంస్థలు వెంటనే స్పందించాలి
ఎన్‌హెచ్‌ఆర్‌సీ రాష్ట్ర అధ్యక్షుడు మొగుళ్ల భద్రయ్య
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్టీఐ, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సి) వంటి న్యాయ విచారణ సంస్థలు తమ పరిధిలో ఉన్న పెండింగ్ ఫైళ్లను తక్షణమే పరిష్కరించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు మర్రపు నాగార్జునరావు ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల కాలం నుండి అనేక ఫిర్యాదులు పరిష్కారం కాని స్థితిలో ఉండటం వల్ల సామాన్య ప్రజలు న్యాయం కోసం ఆరాటపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ విచారణ సంస్థలను నిర్వీర్యం చేయడం వల్లే ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఆయన అన్నారు. పెండింగ్ ఫైళ్లను పరిష్కరించకుండా సాగదీత ప్రక్రియలు, తూతూ మంత్రంగా విచారణ చేయడం ఆపాలని, ఆలస్యానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
న్యాయ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే అవినీతి, అక్రమాలు తగ్గుతాయి. కఠినమైన తీర్పులు, కఠిన చట్టాల అమలుతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని భద్రయ్య స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాలలో కమిషనర్లను నియమించడం సానుకూల పరిణామమని ఆయన అన్నారు. పెండింగ్ ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని, పాలనలోని లోపాలను సరిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సమీక్ష నిర్వహించగా, రాష్ట్ర కార్యదర్శి బొమ్మిడాల మురళి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు వాల్మీకి శోభారాణి, ఉపాధ్యక్షులు ఎస్.వి. సురేష్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మెరుగు రాంబాబు, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు బబ్బూరి వెంకటేష్, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు సూరెడ్డి నవీన్ రెడ్డి, లావణ్య, జాయింట్ సెక్రటరీ సునీతరెడ్డి, అధికార ప్రతినిధి దుర్గ పాండే, బొమ్మగాని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలు మండల కమిటీల నియామకాలను అందజేశారు


