నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా పెండెం లక్ష్మీ రామానంద్
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారిక ప్రకటన
మున్సిపాలిటీని క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా
కాకతీయ, నర్సంపేట : నర్సంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థినిగా 25వ వార్డు నుంచి పోటీ చేస్తున్న పెండెం లక్ష్మీ రామానంద్ను శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి అధికారికంగా ప్రకటించారు. శనివారం నర్సంపేట పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి అండగా నిలవాలని నర్సంపేట మున్సిపాలిటీ ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే పట్టణం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. “ప్రజల ఆశీస్సులతో నర్సంపేట మున్సిపాలిటీలోని మొత్తం 30 కౌన్సిలర్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని, మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తాం. పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం” అని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


