ఆదర్శంగా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి
నాలుగు అవార్డులతో మరోసారి ప్రతిభ
వైద్య సిబ్బందికి కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందనలు
కాకతీయ, పెద్దపల్లి : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన వైద్య విధాన పరిషత్ రాష్ట్ర స్థాయి అవార్డుల్లో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి నాలుగు అవార్డులు సాధించి మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆసుపత్రి వైద్య బృందాన్ని అభినందించారు. సూపరింటెండెంట్, సివిల్ సర్జన్ (అనస్తీషియా) డాక్టర్ కే. శ్రీధర్ ఉత్తమ సేవలకు ప్రథమ అవార్డు అందుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద 3 వేలకుపైగా కేసులు నిర్వహించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచినందుకు రెండో అవార్డు లభించింది. తెలంగాణ డయాగ్నస్టిక్ సేవల్లో ప్రథమ స్థానం సాధించడంతో మూడో అవార్డు దక్కగా, రేడియాలజీ విభాగంలో డాక్టర్ సంధ్యారాణి కృషికి నాలుగో అవార్డు అందించారు.
అవార్డులను కలెక్టర్‌కు చూపించిన వైద్య బృందాన్ని ఆయన చాంబర్‌లో ప్రత్యేకంగా అభినందించారు. వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, సపోర్టింగ్, సానిటేషన్ సిబ్బంది సేవలను ప్రశంసించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు. ఇదే స్పూర్తితో మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభిస్తున్న ఉచిత, నాణ్యమైన వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.


