- డ్రోన్‌లతో పర్యవేక్షించిన సీపీ గౌష్ ఆలం
కరీంనగర్, కాకతీయ: కరీంనగర్ జిల్లాలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ కెమెరాల సహాయంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూలైన్లు, బందోబస్తు ఏర్పాట్లు, ఓటర్ల కదలికలను సీపీ నిరంతరం గమనిస్తున్నారు. మూడో దశ ఎన్నికలు జరుగుతున్న ఐదు మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన స్వయంగా సందర్శించారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది పనితీరును, పోలింగ్ కేంద్రాల వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన సీపీ, ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా కరీంనగర్ పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేపట్టిందని సీపీ గౌష్ ఆలం తెలిపారు.


