సమాజంలో శాంతి బలపడాలి
చేర్యాల 11వ వార్డు కౌన్సిలర్ ఇజాజ్ అహ్మద్
చేర్యాల లో ఘనంగ రంజాన్ వేడుకలు
ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు
కాకతీయ, చేర్యాల : పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని చేర్యాల, మద్దూర్, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాలలోని ముస్లిం సోదరులు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా శనివారం ఈద్గాల వద్దకు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ సినియర్ నేత,చేర్యాల 11వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఇజాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ప్రేమ, సోదర భావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు. ప్రతి ఏడాది హిందూ, ముస్లిం సోదరులు కలిసి రంజాన్ పర్వదినాన్ని జరుపుకొని మతసామరస్యాన్ని చాటుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు. ఆ అల్లా చల్లని దీవెనలతో చక్కగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. పలు చోట్ల పోలీసులు ముస్లింల మత ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో రంజాన్ వేడుకలను జరుపుకున్నారు.


