శాంతి భద్రతలే లక్ష్యం..
నేర నియంత్రణపై దృష్టి సారించాలి
మడికొండ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ ధార కవిత
కాకతీయ, హనుమకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మడికొండ పోలీస్ స్టేషన్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీమతి ధార కవిత బుధవారం వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా మడికొండ ఇన్స్పెక్టర్ పి. కిషన్, కాజిపేట్ ఏసీపీ పీ. ప్రశాంత్ రెడ్డి డీసీపీకి పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించిన డీసీపీ స్టేషన్ పరిసరాలు, గదులు, సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించారు. స్టేషన్ ప్రాంగణంలో మామిడి చెట్టును నాటారు. స్టేషన్ పరిధిలో గత మూడు సంవత్సరాల నేరాల వివరాలను సమీక్షించిన డీసీపీ, నేరాల తగ్గింపుకు తీసుకున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నివారణకు చేపడుతున్న చర్యలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా డీసీపీ ధార కవిత మాట్లాడుతూ, ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, చిన్న సమస్యకైనా వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. నేర నియంత్రణలో భాగంగా రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని, వారి కార్యకలాపాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల సమస్యలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. అలాగే పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం, కుటుంబ జీవనంపై కూడా శ్రద్ధ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో కాజిపేట్ ఏసీపీ పీ. ప్రశాంత్ రెడ్డి, మడికొండ ఇన్స్పెక్టర్ పి. కిషన్, ఎస్సైలు రాజబాబు, రాజ్ కుమార్, రామ్ మోహన్‌లతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



