పాసులు పక్కదారి
అర్హత లేనివారికే వీఐపీ, వీవీఐపీ దర్శనం!
మేడారం జాతరలో ఇష్టారాజ్యంగా పాసుల జారీపై భక్తుల ఆగ్రహం.
కాకతీయ, ములుగు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న సమ్మక్క–సారలమ్మల మహా జాతర 2026లో విఐపి, వివిఐపి దర్శన పాసులు పక్కదారి పట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న జాతర నేపథ్యంలో దర్శన వ్యవస్థలో పారదర్శకత ఉంటుందని అధికారులు చెబుతుండగా, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, ప్రముఖులకు త్వరిత దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన విఐపి, వివిఐపి పాసులు అర్హత లేని వారి చేతుల్లోకి వెళ్లాయని భక్తులు ఆరోపిస్తున్నారు. జాతర ప్రాంతంలో వాటర్ సప్లై చేసే ట్రాలీ ఆటోకు కూడా విఐపి పాస్ ఉండటం బయటపడటంతో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జాతరకు ముందు విఐపి, వివిఐపి పాసుల సంఖ్యకు కోత విధించామని ప్రకటించిన అధికారులు, వాస్తవంగా మాత్రం ఇష్టారాజ్యంగా పాసులు జారీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల సన్నిహితులు, బంధువులు, పరిచయస్తులకు పాసులు కేటాయించారని, అక్కడక్కడా ఒక్కో పాస్‌ను రూ.2000 నుంచి రూ.5000 వరకు అమ్ముకున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది.

దర్శన పాసులపై స్వయంగా మంత్రి ధనసరి అనసూయ సీతక్క మీడియాతో మాట్లాడుతూ, విఐపి, వివిఐపి పాసులను పుట్నాల్లాగా పంచలేం అని, సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా పాసుల సంఖ్యను తగ్గించాం అని స్పష్టం చేశారు. అయితే మంత్రి చెప్పిన మాటలకు భిన్నంగా పాసుల దుర్వినియోగం జరుగుతుండటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఇబ్బందులు పడుతుంటే, అర్హత లేని వారు విఐపి పాసులతో సులువుగా దర్శనం చేసుకుంటున్నారన్న ఆరోపణలు జాతర నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పటికైనా విఐపి, వివిఐపి పాసుల జారీపై సమగ్ర విచారణ చేపట్టి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేనిపక్షంలో మేడారం మహా జాతరపై ప్రజల్లో నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.



