మున్సిపల్ పోరుకు పార్టీల సర్వేలు..!
అభ్యర్థుల ఎంపికపై నేతల నిఘా
ఓటర్ల జాబితాపై కసరత్తు
వార్డుల రిజర్వేషన్లపై హాట్ టాపిక్
కాకతీయ, రామకృష్ణాపూర్ : రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కార్యచరణకు వేగం పెరిగింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నూతన ఆంగ్ల సంవత్సరం 2026 జనవరిలో వెలువడే అవకాశముందని సమాచారం. దీంతో పార్టీల నేతలు, ఆశావాహుల్లో ఉత్కంఠ మొదలైంది. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లే కొనసాగుతాయా? లేక మార్పులు ఉంటాయా? అనే అంశంపై ఆశావాహుల్లో అనుమానాలు నెలకొన్నాయి. అయితే అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రం వార్డుల రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు చేసేందుకు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో గెలిచిన మాజీ ప్రజాప్రతినిధులకు చెక్ పెట్టేలా కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. దీంతో రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్‌గా మారింది.
అభ్యర్థులపై పార్టీల సర్వేలు
మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు సర్వేలను ముమ్మరం చేశాయి. ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు కూడా పుర వార్డుల్లో పర్యటిస్తూ గ్రౌండ్ రిపోర్ట్‌ను అధిష్ఠానానికి పంపిస్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఇప్పటికే తమ సర్వేలను దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం. ఆలస్యమైన పుర పోరుకు పట్టణ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓటర్ జాబితాను మ్యాపింగ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని క్యాతన్‌పల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ‘కాకతీయ’ ప్రతినిధికి తెలిపారు. అప్పటి ఓటర్ జాబితా ప్రకారం 22 వార్డుల్లో 29,785 మంది ఓటర్లు ఉన్నారని, వార్డు వారీగా నూతన ఓటర్ జాబితాను సిద్ధం చేస్తామని చెప్పారు. వార్డుల సంఖ్య, రిజర్వేషన్ల మార్పులు రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.


