కాకతీయ, నేషనల్ డెస్క్: హర్యానాలోని పానిపట్‌లో ఉన్న శ్రీజన్ పబ్లిక్ స్కూల్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ చేయలేదనే కారణంతో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని ప్రిన్సిపాల్ కఠినంగా శిక్షించింది. బాలుడిని కిటికీకి తలకిందులుగా కట్టి, డ్రైవర్ చేతితో కొట్టించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంచలనం రేపింది.
వివరాల్లోకి వెళితే, ఆగస్టు 13న ఈ సంఘటన చోటు చేసుకుంది. వీడియోలో బాలుడిని కిటికీకి వేలాడదీసి డ్రైవర్ అజయ్ కొడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అంతేకాక, మరో వీడియోలో ప్రిన్సిపాల్ రీనా, ఇతర విద్యార్థుల ముందు ఇద్దరు పిల్లలను నిరంతరం కొట్టడం, చెవులు పిండడం కూడా బయటపడింది. ఈ వీడియో సెప్టెంబర్ 27న బయటపడటంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వెంటనే స్పందించి ప్రిన్సిపాల్ రీనా, డ్రైవర్ అజయ్‌లను అరెస్టు చేశారు. వారిపై బీఎన్ఎస్ చట్టంలోని 115, 127(2), 351(2) సెక్షన్లతో పాటు బాలల హక్కుల చట్టంలోని సెక్షన్ 75 కింద కేసులు నమోదు చేశారు.
అయితే ప్రిన్సిపాల్ రీనా తనపై వచ్చిన ఆరోపణలను కొంతమేర అంగీకరించారు. విద్యార్థులు హోంవర్క్ చేయకపోవడంతో మందలించానని, డ్రైవర్‌ను పిలిపించి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నానని తెలిపారు. కానీ డ్రైవర్ బాలుడిని కిటికీకి కట్టేసి అసభ్యంగా ప్రవర్తించిన విషయం తనకు తెలియదని, ఆగస్టు 30న అతన్ని ఉద్యోగం నుంచి తొలగించానని పేర్కొన్నారు.
ఇక స్థానిక తల్లిదండ్రులు మాత్రం ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆమె తరచూ విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెంచుతూ, తరగతి గది మరియు టాయిలెట్లను శుభ్రం చేయమని బలవంతం చేసేదని చెప్పారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్కూల్ యాజమాన్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.


