పంచాయతీ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : జిల్లాలో 3వ విడతలో బుధవారం నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను పటిష్టంగా, సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నర్సంపేట మండలంలోని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో, నెక్కొండ లోని మహేశ్వరి గార్డెన్స్ లో, ఖనాపూర్ లోని జెడ్పిహెచ్ఎస్ లో, చెన్నారావుపేట ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని ప్రతి కౌంటర్ ను, ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. రూట్, జోనల్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఓటరు జాబితాలు, ముద్రలు, ఫారాలు తదితర ఎన్నికల సామాగ్రి సమయానికి, పూర్తి స్థాయిలో అందేలా చూడాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులు పూర్తిస్థాయి బాధ్యతతో పనిచేసి ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసేలా సమన్వయంతో వ్యవహరించాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పి సీఈఓ రాం రెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, సుమా, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా నోడల్ అధికారులు ఎం పి డి ఓ లు, తహసీల్దార్లు, ఇతర ఎన్నికల సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.


