అభివృద్ధిలో పాలేరు నంబర్ వన్
పేదల పాలిట ఆపద్బాంధవుడు మంత్రి పొంగులేటి
మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి
109 మందికి రూ.38.70 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు
కాకతీయ, కూసుమంచి : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మార్గనిర్దేశంలో పాలేరు నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో దూసుకెళ్తోందని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న మంత్రి నివాసంలో తిరుమలాయపాలెం మండలానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మొత్తం 109 మంది బాధితులకు రూ.38.70 లక్షల విలువైన చెక్కులు అందజేసి, పేదల ఆరోగ్య భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ… మంత్రి పొంగులేటి ప్రత్యేక చొరవతో పాలేరు నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని తెలిపారు. అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అగ్రగామిగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


