25న పద్మశాలీల మహా ధర్నా
చేనేత హక్కుల కోసం చలో హైదరాబాద్
పద్మశాలి సంఘం రాష్ట్ర మీడియా కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి
కాకతీయ, హనుమకొండ : చేనేత కార్మికుల హక్కుల సాధన కోసం ఐకమత్యంతో పోరాడాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మీడియా కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి తెలిపారు. ఈ నెల 25న హైదరాబాద్లో నిర్వహించనున్న మహా ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చింతకింది కృష్ణమూర్తి మాట్లాడుతూ, తర తరాలుగా కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ప్రభుత్వాలు మారినా నేతల జీవితాల్లో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేతన్నల భీమా పథకాన్ని బలోపేతం చేయాలని కోరారు. సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణమాఫీ చేయాలని అన్నారు. సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.


