భవిష్యత్ తరాలకు ప్రేరణగా పద్మశ్రీలు
పద్మశ్రీలు వారి సేవలకు దక్కిన నిజమైన గౌరవం
విభిన్న రంగాల్లో తెలంగాణ ప్రతిభకు జాతీయ గుర్తింపు
ఎమ్మెల్సీ మల్క కొమరయ్య.. పద్మశ్రీ గ్రహీతలకు అభినందనలు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏడుగురు ప్రముఖులు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక కావడం పట్ల బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 131 మంది ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిందని, అందులో తెలంగాణ నుంచి ఏడుగురు పద్మశ్రీలు దక్కించుకోవడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని మల్క కొమరయ్య పేర్కొన్నారు. ఇది తెలంగాణ మేధస్సుకు, ప్రతిభకు దేశవ్యాప్తంగా లభించిన గుర్తింపుగా ఆయన అభివర్ణించారు.
తెలంగాణ ప్రతిభకు జాతీయ ముద్ర
సైన్స్, వైద్యం, కళలు, పశుసంవర్ధక రంగాల్లో తెలంగాణకు చెందిన నిపుణులు అసాధారణ ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని ఎమ్మెల్సీ అన్నారు. ముఖ్యంగా సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో విశిష్ట పరిశోధనలు చేసిన గడ్డమానుగు చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణియన్, **కుమారస్వామి తంగరాజ్లకు పద్మశ్రీ లభించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. వైద్య రంగంలో ప్రముఖ సర్జన్‌గా గుర్తింపు పొందిన గూడూరు వెంకట్ రావు, క్యాన్సర్ నిపుణుడైన **పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డిలకు అవార్డులు రావడం వారి సేవలకు దక్కిన నిజమైన గౌరవమని అన్నారు.
స్ఫూర్తినిచ్చే పద్మశ్రీలు
కళారంగంలో ప్రతిభను చాటిన దీపికా రెడ్డి, పశుసంవర్ధక విభాగంలో విశేష సేవలు అందించిన *రామారెడ్డి మామిడి*లకు పద్మశ్రీలు లభించడం వారి మేధస్సుకు, కృషికి దక్కిన గుర్తింపుగా మల్క కొమరయ్య ప్రశంసించారు. ఈ పద్మశ్రీ పురస్కారాలు కేవలం వ్యక్తిగత గౌరవాలే కాకుండా, భవిష్యత్ తరాలకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయని ఎమ్మెల్సీ అన్నారు. మరింతమంది యువత వివిధ రంగాల్లో సేవలందిస్తూ తెలంగాణ ఖ్యాతిని, దేశ కీర్తిని మరింత ఇనుమడింపజేసే దిశగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.


