కాకతీయ, నేషనల్ డెస్క్: సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశంలో ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక ప్రశ్నలు లేవనెత్తారు. దేశవ్యాప్తంగా మైక్రోఫైనాన్స్ రుణాల బకాయిలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సమస్యపై ప్రభుత్వ అవగాహన, విశ్లేషణ, పరిష్కార చర్యలపై ఆయన వివరణ కోరారు.
ఒవైసీ ప్రశ్నిస్తూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మైక్రోఫైనాన్స్ రుణాల బకాయిలు 163 శాతం పెరిగి రూ. 43,000 కోట్లకు చేరుకున్నాయని అన్నారు. ఈ పెరుగుదల ప్రత్యేకించి చిన్న మొత్తంలో రుణాలు తీసుకున్న స్మాల్ బారోవర్ల (Small Borrowers) వద్ద ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది మైక్రోఫైనాన్స్ రంగానికి, మొత్తం క్రెడిట్ ఎకోసిస్టమ్‌కి ప్రమాదకర సంకేతమని ఓవైసీ అభిప్రాయపడ్డారు.
మైక్రోఫైనాన్స్ రుణాలు ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలకు, మహిళలకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుతాయి. ఈ రుణాలు తిరిగి చెల్లించడంలో సమస్యలు రావడం వల్ల NBFC-MFIs (Non-Banking Financial Companies – Microfinance Institutions), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వంటి సంస్థలు ఆర్థికపరంగా ఒత్తిడికి గురవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఈ బకాయిల పెరుగుదల వెనుక కారణాలను గుర్తించిందా? ద్రవ్యోల్బణం, ఉపాధి అవకాశాల లోపం, వ్యవసాయ, చిన్న వ్యాపార రంగాలలో నష్టాలు వంటి అంశాలు ఎంత మేర ప్రభావం చూపుతున్నాయో ప్రభుత్వం అధ్యయనం చేసిందా? అనే ప్రశ్నలను ఒవైసీ స్పష్టంగా ముందుకు తెచ్చారు.
అంతేకాదు ఈ పరిస్థితి NBFCలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మాత్రమే కాకుండా దేశంలోని మొత్తం బ్రాడర్ క్రెడిట్ సిస్టమ్ (Broader Credit Ecosystem) పైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. భవిష్యత్తులో మైక్రోలోన్ పోర్ట్‌ఫోలియో (Microloan Portfolio) ఇంకా క్షీణించకుండా ప్రభుత్వం ప్రత్యేక సరిదిద్దే విధానం (Corrective Framework) రూపొందిస్తుందా? ఉంటే దాని వివరాలను వెల్లడించాలని ఆయన కోరారు.
ఈ ప్రశ్న మైక్రోఫైనాన్స్ రంగంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై దృష్టి సారించడమే కాకుండా, చిన్న రుణగ్రహీతలు, రుణమిచ్చే సంస్థల భవిష్యత్తుపై ఆందోళనలను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ప్రభుత్వం ఈ ప్రశ్నకు ఎలా సమాధానం ఇస్తుందో, ఏ చర్యలు తీసుకుంటుందో అన్నది మైక్రోఫైనాన్స్ రంగం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


