మేడారంలో కిక్కిరిసిన ఆస్పత్రులు
క్యూల్లోనే కుప్పకూలుతున్న భక్తులు
తోపులాటలతో అనేక మందికి అస్వస్థత
ఎవరూ పట్టించుకోవడం లేదని భక్తుల ఆందోళన
కాకతీయ, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో వైద్య సేవలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. మేడారంలో ఏర్పాటు చేసిన ప్రధాన 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు మినీ ఆస్పత్రులు పూర్తిగా నిండిపోయాయి. బెడ్లు ఖాళీ లేకపోవడంతో అనేక మంది భక్తులు ఆస్పత్రి ఆవరణలోనే చికిత్స కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం, తీవ్రమైన ఉక్కపోత, అలసట కారణంగా వందలాది మంది భక్తులు నీరసం, కీళ్ల నొప్పులు, శ్వాసకోస సంబంధిత సమస్యలతో అస్వస్థతకు గురవుతున్నారు.

కొందరు భక్తులు సరైన సమయంలో వైద్యం అందడం లేదని, వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ జనసందోహమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం 5,192 మంది వైద్య సిబ్బందిని డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో విధుల్లోకి దించింది. జాతర ప్రాంగణంలో 30, మేడారానికి వచ్చే దారుల్లో మరో 42 కలిపి మొత్తం 72 మెడికల్ క్యాంపులు పనిచేస్తున్నాయి. ట్రాఫిక్ జామ్‌ల కారణంగా అంబులెన్సులు చేరలేని ప్రాంతాల్లో సేవలందించేందుకు 40 బైక్ అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో సమీప హెల్త్ క్యాంప్‌ను సంప్రదించాలని లేదా 108కు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. తీవ్రమైన కేసులను వెంటనే ములుగు ప్రభుత్వ ఆస్పత్రి లేదా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు.



