పారదర్శకతకే మన ఇసుక వాహనం అమలు
ఆన్లైన్ విధానంతో ఇసుక సరఫరా
అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
కాకతీయ సిరిసిల్ల టౌన్ : ఇసుక తరలింపులో పారదర్శకత కోసం మన ఇసుక వాహనం ఆన్లైన్ విధానం అమలు చేస్తున్నామని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవస్థను పూర్తిగా డిజిటల్ రూపంలో తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. సిరిసిల్లలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు, గ్రామ పాలన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ మన ఇసుక వాహనం అప్లికేషన్ ద్వారా ఇసుక బుకింగ్, చెల్లింపులు, అనుమతులు అన్నీ ఆన్లైన్ లోనే నిర్వహించబడతాయని తెలిపారు. నిర్మాణదారులు ఎక్కడి నుంచి ఇసుక పొందాలి, ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా కమిటీ ఆమోదించిన రీచ్ల నుంచే ఇసుక తరలింపును అనుమతిస్తామని తెలిపారు. కూపన్ విధానానికి బదులుగా ఆన్లైన్ విధానాన్ని పూర్తిగా అమలు చేస్తామని చెప్పారు. ఇసుక కేటాయింపు, తరలింపు ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆన్లైన్ బుకింగ్ విషయంలో రెవెన్యూ అధికారులు అవసరమైన సహాయం అందిస్తారని తెలిపారు. సమావేశంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా మైనింగ్ అధికారి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


