ఆపరేషన్ స్మైల్ విజయవంతం
జిల్లాలో 52 మంది బాలలకు విముక్తి
బాల కార్మికులను పనిలో పెట్టుకున్నవారిపై కేసులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడి
కాకతీయ, సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించిన ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమం ఘన విజయాన్ని నమోదు చేసిందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టి 52 మంది బాలబాలికలను గుర్తించి, వారి భద్రతను నిర్ధారించినట్లు వెల్లడించారు. గుర్తించిన బాలలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ముందు హాజరుపర్చి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం వారి సంరక్షణకు అప్పగించినట్లు పేర్కొన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన బాలలను గుర్తించి కుటుంబాల వద్దకు చేర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ‘ఆపరేషన్ స్మైల్’, ‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమాల అమలులో భాగంగా జిల్లాలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు చెప్పారు.
ప్రత్యేక బృందాల తనిఖీలు
ఈ ఏడాది జనవరి 1 నుంచి 31 వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, రెవెన్యూ, హెల్త్ శాఖల అధికారులు కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ వివరించారు. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో హోటళ్లు, దుకాణాలు, వర్క్‌షాపులు, బస్టాండ్‌లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుని బాలకార్మికులుగా వినియోగించిన వారిపై 4 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ మహేష్ బి. గితే స్పష్టం చేశారు. బాలల హక్కులను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ పేర్కొన్నారు. వీధి బాలలు లేదా బాలకార్మికులను గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని తెలిపారు. ఈ చర్యలతో బాలల భద్రతకు మరింత భరోసా కలుగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.


